గ్రామీణ ప్రజారోగ్యానికి పెద్దపీట..
వైసీపీ హయాంలో శిలాఫలకాలకే పరిమితం…
కూటమిలోనే ప్రభుత్వ ఆస్పత్రుల నిర్మాణాలు…ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
: గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి నియోజకవర్గం కొరిశపాడు మండలం, ప్రాసంగులపాడు గ్రామంలో మంత్రి గొట్టిపాటి మంగళవారం నాడు పర్యటించారు.
ముందుగా ప్రాసంగులపాడులో రూ.1.77 కోట్లతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ., గత వైసీపీ ప్రభుత్వం గ్రామీణ ప్రజారోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ఆస్పత్రుల నిర్మాణాలకు నిధులు కేటాయించకుండా అనుమతులు, శిలాఫలకాలకే పరిమితమైందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త ఆస్పత్రులను నిర్మిస్తున్నామన్నారు. వీటితో పాటు గతంలో నిర్లక్ష్యానికి గురైన ఆస్పత్రుల నిర్మాణాలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు.
ప్రాసంగులపాడు ఆరోగ్య కేంద్ర పరిసరాలను పరిశీలించిన అనంతరం మంత్రి గొట్టిపాటి సిబ్బందితో మాట్లాడారు. త్వరలోనే ఆస్పత్రి చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపడతామన్నారు.
ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రాసంగులపాడులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి భూమి దానం చేసిన దాతలను మంత్రి గొట్టిపాటి దుశ్సాలువాలతో సత్కరించారు.
అనంతరం జరిగిన సామూహిక సీమంతాలు కార్యక్రమంలోనూ మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు.
ఆరు పెద్దాసుపత్రులు,30 హెల్త్ సబ్ సెంటర్లు:
అద్దంకి నియోజకవర్గంలోనే ఒక్కొక్కటి రూ.1.70 కోట్ల నుంచి రూ.2 కోట్ల వ్యయంతో ఆరు పెద్ద ఆస్పత్రులను నిర్మిస్తున్నామని మంత్రి గొట్టిపాటి తెలిపారు. వీటితో పాటు 30 హెల్త్ సబ్ సెంటర్ల నిర్మాణం కూడా చేపట్టామని పేర్కొన్నారు. వీటితో పాటు వైసీపీ ప్రభుత్వ హాయంలో అసంపూర్తిగా మిగిలిన వాటిని నిర్మాణం పూర్తి చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ప్రారంభోత్సవం తరువాత ప్రాసంగులపాడు ఎస్సీ కాలనీలో రూ.30 లక్షల సీఎస్ఆర్ నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. రూ.50 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను కూడా ప్రారంభించారు. రూ.33.70 లక్షల జల్ జీవన్ మిషన్ (జేజేఎం) నిధులతో పూర్తి చేసిన ఇంటింటికీ మంచినీటి కుళాయిల పథకాన్ని కూడా మంత్రి గొట్టిపాటి ప్రజలకు అంకితం చేశారు. అనంతరం ప్రాసంగులపాడు ఎస్సీ కాలనీలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులతో పాటు ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

