దశాబ్ద కాల భూ సమస్యకు పరిష్కారం.. మంత్రి గొట్టిపాటి రవికుమార్కు దైవాలరావూరు గ్రామస్తుల సత్కారం
అద్దంకి: దశాబ్ద కాలంగా దైవాలరావూరు గ్రామ ప్రజలను వేధిస్తున్న 22ఏ నిషేధిత జాబితా భూ సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. తమ భూములను 22ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించి, రిజిస్ట్రేషన్లకు మార్గం సుగమం చేసిన నేపథ్యంలో శుక్రవారం మేదరమెట్లలో రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న భూ సమస్యకు పరిష్కారం లభించడంతో తమకు ఎంతో ఊరట కలిగిందని గ్రామస్తులు పేర్కొన్నారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రెవెన్యూ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి గార్లకు కూడా గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవాలరావూరు గ్రామస్తులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

