ప్రజల విశ్వాసమే పోలీసుల విధులకు కొలమానం..గౌరవంగా, బాధ్యతగా వ్యవహరించండి..శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులే కీలకం…యువతకు ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం…
పాసింగ్ అవుట్ పెరేడ్ లో మంత్రి గొట్టిపాటి…
ఒంగోలు – పోలీస్ యూనిఫాం అంటే కేవలం డ్రస్ కాదని.. ప్రజలపై ఉన్న బాధ్యతకు గుర్తు అని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీస్ పరెడ్ గ్రౌండ్ లో శనివారం జరిగిన 5వ బ్యాచ్ కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్‌లో మంత్రి గొట్టిపాటి ముఖ్య అతిథిగా పాల్గొని గౌరవ వందనాన్ని స్వీకరించారు. శిక్షణ పూర్తి చేసుకున్న నూతన కానిస్టేబుళ్లకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… ప్రజల విశ్వాసమే పోలీసుల విధులకు కొలమానమని చెప్పారు.
నూతనంగా విధుల్లో చేరే ప్రతి ఒక్కరూ ప్రజలతో గౌరవంగా, బాధ్యతగా, సానుభూతితో వ్యవహరిస్తూ చట్టాన్ని గౌరవించాలని మంత్రి సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అత్యంత కీలకమని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. దాదాపు ఐదు లక్షల మందికి పైగా దరఖాస్తుదారుల్లో నిబంధనలకు అనుగుణంగా అర్హత సాధించిన సుమారు 6 వేల మంది అభ్యర్థులను ఎంపిక చేసి అత్యుత్తమ శిక్షణ అందించినట్లు మంత్రి తెలిపారు. ఒంగోలు ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందిన కానిస్టేబుళ్లు తమ శిక్షణాధికారులు గర్వపడేలా విధులు నిర్వర్తించాలని మంత్రి గొట్టిపాటి ఆకాంక్షించారు.
విధుల్లో బాధ్యతతో కూడిన జవాబుదారీతనాన్ని పాటిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొనేలా పనిచేయాలని ఆయన కోరారు. పోలీస్ శాఖతో పాటు తమ కుటుంబాలకు కూడా మంచి పేరు తీసుకురావాలన్నారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది వృత్తిపరమైన నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని మంత్రి గొట్టిపాటి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు మానసికంగా కూడా ఎప్పటికప్పుడు తమను తాము మెరుగుపరుచుకుని విధుల్లో మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ, చట్ట పరిధిలో రాజీలేని విధంగా విధులు నిర్వర్తించాలన్నారు. శిక్షణ కాలంలోనూ ఆర్థిక భరోసా అవసరమన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు కానిస్టేబుళ్ల స్టైఫండ్‌ను రూ.4,500 నుంచి రూ.12 వేలకు పెంచారని చెప్పారు.
యువతకు ఉద్యోగాలే కూటమి ప్రభుత్వ లక్ష్యం..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పననే ధ్యేయంగా పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి తెలిపారు. రాష్ట్ర యువతకు మంచి భవిష్యత్తు కల్పించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగేలా రాష్ట్రానికి పెట్టుబడులు, బడా సంస్థలు వచ్చేలా కృషి చేస్తున్నామని ఆయన వివరించారు. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాయన్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను మరింత పటిష్టం చేయడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా సుమారు 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా కానిస్టేబుళ్లకు నియామక పత్రాలు అందజేశారని పేర్కొన్నారు. ఇప్పటికే డీఎస్సీ ద్వారా 16 వేల మందికి పైగా ఉపాధ్యాయులను నియమించామన్నారు. విద్యుత్ శాఖలో 600కు పైగా ఏఈఈ పోస్టులకు రాత పరీక్ష పూర్తయిందని మంత్రి వెల్లడించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అర్హులైన అభ్యర్థులకు త్వరలోనే విద్యుత్ శాఖలో ఏఈఈ ఉద్యోగాలు కల్పించనున్నట్లు ఆయన తెలిపారు. యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, విజయ్‌కుమార్, కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో పాటు పలువురు పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

