అద్దంకి : రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు
. అద్దంకి మండలం బొమ్మనంపాడులో ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ శనివారం పర్యటించారు. ముందుగా కాకానివారిపాలెం – గుర్రంవారిపాలెం వయా బొమ్మనంపాడు మీదుగా రూ.3.25 కోట్లతో నిర్మించనున్న తారురోడ్డుకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ… రహదారుల అభివృద్ధితో గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయన్నారు. తద్వారా రాష్ట్రాభివృద్ధి మరింత వేగవంతమవుతుందని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.2,123 కోట్లతో కొత్త రహదారుల నిర్మాణంతో పాటు మారుమూల గ్రామాల్లోనూ రోడ్ల మరమ్మతులు చేపడుతున్నట్లు మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాలను పట్టణ ప్రాంతాలతో అనుసంధానించేలా కొత్త రహదారులను నిర్మిస్తున్నామని, దీనివల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడతాయని చెప్పారు. రహదారులు కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాదని., గ్రామాల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి కీలకంగా నిలుస్తాయని స్పష్టం చేశారు.
వైసీపీ పాలనలో రోడ్లపై నిర్లక్ష్యం…
వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో కొత్త రహదారుల నిర్మాణాలను నిర్లక్ష్యంతో పూర్తిగా విస్మరించారని మంత్రి గొట్టిపాటి ఆరోపించారు. కనీసం కిలోమీటరు రోడ్డుకు కూడా సక్రమంగా మరమ్మతు చేయలేదని ఆయన విమర్శించారు. గత పాలనలో నిర్లక్ష్యానికి గురైన రహదారుల పరిస్థితిని చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్య క్రమంలో పనులు చేపడుతోందని మంత్రి వివరించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. మౌలిక వసతుల కల్పన, రహదారుల అభివృద్ధి, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రహదారులు కీలకమని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులను వేగవంతం చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ నేతలు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

