మార్చి 2027లో జరిగే ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు ప్రైవేట్ అభ్యర్థులుగా హాజరయ్యే వారి కోసం హాజరు మినహాయింపు దరఖాస్తుల గడువులను ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి పి. రంజిత్ బాషా ప్రకటించారు.
దరఖాస్తు గడువు & ఫీజు వివరాలు:సాధారణ రుసుము: రూ. 1,500 ఫీజుతో ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
ఆలస్య రుసుము:రూ. 500 అపరాధ రుసుముతో అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 18 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
పరీక్ష రాసేందుకు అర్హతలు & నిబంధనలు:ఏడాది గ్యాప్ ఉన్నవారు ఎస్సెస్సీ (10వ తరగతి) పూర్తయిన తర్వాత ఒక సంవత్సరం గ్యాప్ ఉన్న అభ్యర్థులు మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షలను కొత్త సిలబస్‌తో రాయవచ్చు.రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ గ్యాప్ ఉన్నవారు మొదటి మరియు రెండో సంవత్సరం పరీక్షలకు ఒకేసారి హాజరుకావచ్చు. *గ్రూపు మార్పు:* గతంలో ఇంటర్ పరీక్షల్లో విఫలమైన విద్యార్థులు సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ / హ్యూమానిటీస్కు మారి కొత్త సిలబస్‌తో పరీక్షలు రాయవచ్చు.
అదనపు సబ్జెక్ట్:ఇంటర్ పాస్ సర్టిఫికెట్ ఉన్నవారు అదనపు సబ్జెక్టుగా రెండో భాషను పాత సిలబస్‌తో రాయడానికి అవకాశం ఉంది. తొలిసారి హాజరయ్యే ప్రైవేట్ అభ్యర్థులు:రెగ్యులర్ విద్యార్థుల కొత్త సిలబస్ ప్రకారమే పరీక్షలు రాయాలి. వీరు తప్పనిసరిగా ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలకు కూడా హాజరుకావాలి.
దరఖాస్తు చేసుకునే విధానం: అర్హులైన అభ్యర్థులు సమీపంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్‌కు దరఖాస్తు అందజేయాలి.
దరఖాస్తుతో పాటు ఎస్సెస్సీ పాస్ సర్టిఫికెట్, టీసీ (TC), స్టడీ సర్టిఫికెట్, అవసరమైన మైగ్రేషన్ / ఎలిజిబిలిటీ ధ్రువపత్రాల ఒరిజినల్స్ సమర్పించాలి.
పోస్టు ద్వారా లేదా వ్యక్తిగతంగా బోర్డు కార్యాలయానికి పంపే దరఖాస్తులను స్వీకరించరు.
సర్టిఫికెట్లను పరిశీలించి అర్హతలను నిర్ధారించిన తర్వాత ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ స్థాయిలోనే హాజరు మినహాయింపు ఉత్తర్వులు జారీ చేసి, నిర్ణీత గడువులో పరీక్ష ఫీజు చెల్లించేందుకు అనుమతిస్తారు.


