అద్దంకి నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమిస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురవ మండలం, ఎస్.ఎల్. గుడిపాడు గ్రామంలో గురువారం నిర్వహించిన ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
అనంతరం ప్రజా సమస్యలు ఆరా తీస్తూ… స్థానిక ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా రూ.40 లక్షలతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్లను ప్రారంభించారు.
గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును, డీ ఎస్ వీ ఫౌండేషన్, అసిస్ట్ సహకారంతో ఏర్పాటు చేసిన రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. గుడిపాడుతో పాటు నూజెళ్ళపల్లి, సోమవరప్పాడు గ్రామాల్లోనూ డీ ఎస్ వీ ఫౌండేషన్ , అసిస్ట్ సహకారంతో వాటర్ ప్లాంటులను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
అనంతరం నిర్వహించిన ప్రజావేదికలో గ్రామస్థులతో మంత్రి గొట్టిపాటి నేరుగా మాట్లాడి ప్రజల నుంచి అర్జీలను తీసుకున్నారు. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు, స్థానిక నేతలు, అధికారులు పాల్గొన్నారు.


